7/20/10

చోప్సి




కావలసిన పదార్ధాలు :
నూడుల్స్ : ఒక ప్యాకెట్
కేరట్ : మూడు , సన్నగా పొడుగు ముక్కలుగా తరగాలి
బీన్స్ : ఇరవై , చిన్న చిన్న ముక్కలుగా తరగాలి
కాబేజీ : ఒక చిన్న ముక్క, సన్నగా తరగాలి
అల్లం: ఒక చిన్న ముక్క, సన్నగా , చిన్న చిన్న ముక్కలు తరగాలి
వెల్లుల్లి: నాలుగు రెబ్బలు , చిన్న చిన్న ముక్కలు తరగాలి
ఉల్లిపాయలు: రెండు, సన్నగా , చీలికలుగా తరగాలి
కార్న్ ఫ్లౌర్ : రెండు టేబుల్ స్పూన్లు
నూనె: వేయించటానికి సరిపడా
మిరియాల పొడి : అర టీ స్పూను, పొడి చెయ్యాలి
అజినమోటో: పావు టీ స్పూను
పంచదార: ఒక టీ స్పూను
టమాట సాస్: మూడు టేబుల్ స్పూన్లు
వినేగార్ : ఒక టేబుల్ స్పూను
ఉప్పు : రుచుకి సరిపడా

తయారు చేసే విధానము :
ముందుగా ఒక బాణీలో నూడుల్స్ మునిగేలాగ నీరు పోసి , ఆ నీటిలో ఒక స్పూను ఉప్పు , ఒక స్పూను నూనె వేసి బాగా మరగనివ్వాలి. తరువాత నూడుల్స్ ని ఆ నీటి లో వేసి బాగా ఉడకనివ్వాలి. నూడుల్స్ ఉడికాక వాటిని నుండి నీరు తీసేసి ఒక చిల్లుల పళ్ళెం లో వేసి పక్కన పెట్టి బాగా ఆరనివ్వాలి.

ఇప్పుడు ఒక బాణీలో వేయించటానికి సరిపడా నూనె వేసి కాగనివ్వాలి. బాగా ఆరిన నూడుల్స్ ఒక దోసెడు తీసుకొని ,పక్షి గూడులగా, చేసి కాగిన నూనేలో వేసి లేత బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.

అలా ఉడకబెట్టిన నూడుల్స్ అన్నిటిని వేయించుకోవాలి.


ఇప్పుడు ఒక బాణీలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి కాగనివ్వాలి. కాగిన నూనేలో సన్నగా తరిగిన అల్లం మరియు వెల్లుల్లి వేసి వేగనివ్వాలి. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసి లేత బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.

ఇప్పుడు తరిగి పెట్టుకున్న కేరట్, వేగనివ్వాలి వేగనివ్వాలి కాబేజీ బాణీలో వేసి కూరలు ఉడికేదాకా వేగనివ్వాలి. కూరలు కొంచెం ఉడికినా ఇంకా కరకరలాడేలాగే ఉండాలి.

ఇప్పుడు మిరియాల పొడి, అజినమోటో, ఉప్పు మరియు పంచదార వెయ్యాలి. తరువాత టమాట సాస్ మరియు వినెగర్ కూడా వెయ్యాలి. ఇప్పుడు రెండు గ్లాస్ నీరు పోసి బాగా ఉడకనివ్వాలి( కూరలు ఉడక పెట్టినప్పుడు వచ్చిన నీరు ఉన్నా పొయ్యవచ్చు) .

రెండు స్పూన్ల కార్న్ ఫ్లోర్ తీసుకొని , దానిలో సరిపడా నీరు పోసి ఆ కార్న్ ఫ్లోర్ నీటిని బాణిలో ఉడుకుతున్న మిశ్రమం లో పోసి బాగా కలపాలి. సాస్ లాగా చిక్కపడేవరకు గ్యాస్ మీద ఉంచాలి.

ఇప్పుడు ఒక ప్లేట్ లో వేయించి పెట్టుకున్న నూడుల్స్ ముందుగా పెట్టి దానిమీద ఇందాక తయారుచేసిన సాస్ వేడి వేడిగా పోసి సర్వ్ చెయ్యాలి. చోప్సీ రెడీ......



10/14/09

వెజిటబుల్ పులావ్


కావలసిన పదార్ధాలు:
బియ్యం : అర కిలో
కారెట్ : నాలుగు అయిదు ( చిన్న చిన్న ముక్కలుగా తరుగుకోవాలి )
బీన్సు: వంద గ్రాములు ( చిన్న చిన్న ముక్కలుగా తరుగుకోవాలి )
బంగాళా దుంపలు లేదా ఆలూ: నాలుగు అయిదు ( చిన్న చిన్న ముక్కలుగా తరుగుకోవాలి )
ఉల్లిపాయలు : అయిదు ఆరు ( పొడుగ్గా చీలికలు చేసుకోవాలి)
కాలిఫ్లవర్: ఒక చిన్న పువ్వు ( కావాలంటే వేసుకోవచ్చు )
పచ్చి బఠాణీ : ఒక కప్ ( నాన బెట్టినవి, లేదా తాజావి )
లవంగాలు: అయిదు ఆరు
యాలకులు : అయిదు ఆరు
దాల్చిన చెక్క : అయిదు ఆరు చిన్న ముక్కలు
అల్లం వెల్లుల్లి ముద్ద : రెండు టీ స్పూన్లు
నూనె , నేయ్యి లేదా డాల్డా : తగినంత
పచ్చిమిర్చి: అయిదు ఆరు( చీలికలు చేసుకోవాలి)
ధనియాలు, జీలకర్ర పొడి: రెండు స్పూన్లు ( కావలిస్తే వేసుకోవచ్చు )
కారం: ఒక స్పూను ( కారం ఇష్ట పడేవాళ్ళు వేసుకోవచ్చు )
పసుపు: చిటికెడు ( రంగు కోసం )
ఉప్పు : రుచికి తగినంత
నీరు: ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల నీరు
కొత్తిమీర: ఒక కట్ట
పుదినా : అర కట్ట ( తినేవారు వేసుకోవచ్చు)
జీడిపప్పు: పది పదిహేను ( కావాలంటే వేసుకోవచ్చు)
బిర్యాని ఆకు : రెండు మూడు

తయారు చేసే విధానం :
ముందుగా బియ్యం కడిగి నీటిలో ఒక అరగంట నాన నివ్వాలి. కూరలన్నీ తరిగి పెట్టుకోవాలి.

ఒక మందంగా ఉన్న గిన్నె గాని కుక్కర్ గాని తీసుకొని గ్యాసు మీద పెట్టాలి. అందులో సుమారు రెండు మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె కాగాక అందులో లవంగాలు, యాలకులు , జీడి పప్పు, బిర్యాని ఆకు మరియు చెక్క వేసి వేయించాలి.

ఇప్పుడు అందులో ఉల్లిపాయలు వేసి దోరగా వేయించాలి.

ఉల్లిపాయలు వేగాక అల్లం వెల్లుల్లి ముద్ద వెయ్యాలి. అది పచ్చి వాసన పోయే దాక వేయించి పచ్చి మిర్చి వేసుకోవాలి. వేగాక అందులో తరిగి ఉంచుకున్న కూరగాయ ముక్కలు వేసుకోవాలి.

అవి కొంచెం వేగ నివ్వాలి. ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యం వెయ్యాలి. అన్ని బాగా కలిపి కొత్తిమీర, పుదినా, ఉప్పు, పసుపు, కారం మరియు ధనియాలు జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి.

ఇప్పుడు ఒక వంతు బియ్యానికి రెండు వంతులు నీరు పోసి అన్నీ బాగా కలిపి మూత పెట్టుకోవాలి.
కుక్కర్ ఐతే మూడు కూతలు రాగానే కట్టేయ్యాలి. గిన్నెలో ఐతే అన్నం ఉడికాక గ్యాసు కట్టేయ్యాలి.
పులావ్ తో పాటు ఉల్లిపాయ రైతా చేసుకుంటే బాగుంటుంది.

కాజాలు లేదా చెక్కర బాణాలు


మా ఇంట్లో వీటిని కాజాలని అంటాము. మా అత్తారింట్లో వీటిని చెక్కర బాణాలని అంటారు. కాబట్టి రెండు రాసాను. ఇవి కాకినాడ కాజా మరియు మడత కాజా లాగా కాకుండా చాల సులువుగా చేసుకోవచ్చు.

కావలసిన పదార్ధాలు :
మైదా పిండి : అర కిలో
ఉప్పు : రుచికి తగినంత
నూనె : వేయించడానికి తగినంత
బెల్లం లేదా పంచదార: అర కిలో

తయారు చేసే విధానం:
వీటిని పాకం పట్టుకోవచ్చు లేదా ఉప్పు కారం వేసి కమ్మగా చేసుకోవచ్చు. స్వీటు హాటు కూడా చేసుకోవచ్చన్నమాట. ముందుగా మైదా పిండి తీసుకొని అందులో కమ్మటి వాటికైతే ఉప్పు కలపాలి, తీపి వాటికి అక్కరలేదు. మైదా పిండిలో కొంచెం ( నాలుగు అయిదు స్పూన్లు) కాచిన నూనె కలుపుకోవాలి. అప్పుడు కాజాలు గుల్లగా వస్తాయి. తరువాత తగినన్ని నీరు పోసి చపాతి పిండిలాగా కలుపుకోవాలి.

ఇప్పుడు పెద్ద పెద్ద ఉండలు చేసి పెద్ద చపాతీ లాగా వత్తుకోవాలి.

ఆ చపాతీని ముందు నిలువుగా తరువాత అడ్డంగా చాకుతో కోసుకోవాలి డైమెండ్ ఆకారం లో .

ఇప్పుడు అలా కోసిన వాటిని కాగిన నూనెలో దోరగా వేయించుకోవాలి. అలాగే మిగిలిన పిండిని కూడా వత్తి , కోసి వేయించుకోవాలి. కమ్మటివి కావాలనుకుంటే కొంచెం ఉప్పు కారం ఆ కాజాల మీద చల్లుకుని ఒక డబ్బాలో నిలువ ఉంచుకోవచ్చు. తియ్యటివి కావాలనుకుంటే పంచదార లేదా బెల్లం ముదురు పాకం పట్టి అందులో వేయించిన కాజాలు వేసి బాగా కలుపుకోవాలి , పాకం అన్ని కాజాలకి పట్టేలాగా . చల్లారిన తరువాత ఒక డబ్బాలో నిలువ చేసుకోవాలి.

పప్పు చెక్కలు


కావలసిన పదార్ధాలు :
వరిపిండి : అర కిలో
నీరు : అర లీటరు
శనగపప్పు : యాభై గ్రాములు ( రెండు గుప్పెళ్ళు సుమారు), రెండు గంటలు ముందుగా నానబెట్టుకోవాలి
కారం : రెండు స్పూన్లు లేదా పచ్చిమిర్చి పేస్టు : రెండు స్పూన్లు
కరివేపాకు: రెండు మూడు రెబ్బలు
ఉప్పు : రుచికి తగినంత
నూనె : వేయించడానికి సరిపడా

తయారు
చేసే విధానం:

ముందుగా గ్యాసు మీద ఒక బాణీ పెట్టుకొని అందులో నీరు పోసుకోవాలి. నీరు బాగా మరిగాక అందులో సెనగపప్పు, కారం , ఉప్పు, చిన్న చిన్నగా తుంపిన కరివేపాకు మరియు వరిపిండి వేసి బాగా కలుపుకోవాలి. గ్యాసు ఆపేసి తయారైన మిశ్రమాన్ని బాగా చల్లారా నివ్వాలి.

ఇప్పుడు ఆ మిశ్రమాన్ని చిన్న ఉండలాగా చేసి ఒక ప్లాస్టిక్ కవర్ మీద కానీ అరిటాకు మీద కాని పల్చగా వత్తుకోవాలి.


అలా
వత్తిన వాటిని బాగా కాగిన నూనెలో వేసి దోరగా వేయించుకోవాలి . ఇలాగే మిగిలిన పిండితో కూడా చెక్కలు వత్తుకొని వేయించుకోవాలి. చల్లారిన చక్కలను ఒక గట్టి మూత ఉన్న డబ్బాలో పెట్టి నిలువ ఉంచుకోవచ్చు.

దోస ఆవకాయ


కావలసిన పదార్ధాలు :
దోసకాయలు : అర కిలో
ఆవపిండి : ముప్పై గ్రాములు సుమారు
ఉప్పు : నలభై గ్రాములు సుమారు
కారం : యాభై గ్రాములు సుమారు
నూనె : వంద గ్రాములు

తయారు చేసే విధానం:

ముందుగా దోసకాయను తీసుకొని సగానికి తరిగి అందులో గింజలు తీసి వేసి చిన్న చిన్న ముక్కలుగా తరుగుకోవాలి.

దోసకాయ చెక్కు తియ్యకూడదు . ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో దోసకాయ ముక్కలు , ఆవపిండి, కారం, ఉప్పు మరియు నూనె వేసి బాగా కలుపుకోవాలి.

ఉప్పు రుచిని బట్టి తక్కువైతే మళ్ళీ కలుపుకోవచ్చు. అలా అన్నీ బాగా కలిపిన తరువాత మూత పెట్టి ఊరనివ్వాలి. ఒక రోజు ఊరితే కారం , ఉప్పు మరియు ఆవపిండి ముక్కలకి బాగా పడుతుంది. మరీ పొడి పొడిగా అనిపిస్తే కొంచెం నూనె కలుపుకోవచ్చు. అలా ఊరిన దోస ఆవకాయిని ఒక గట్టి మూత ఉన్న డబ్బాలో పెట్టి నిలువ ఉంచుకోవాలి. ఇది మూడు నాలుగు వారాలదాకా నిలువ ఉంటుంది.

వేరుసెనగపప్పు చిక్కి


కావలసిన పదార్ధాలు:

వేరుసెనగపప్పు లేదా పల్లీలు - అర కిలో
బెల్లం - అర కిలో ( తరుగుకోవాలి )
గుల్ల సెనగపప్పు లేదా పుట్నాలు - రెండు మూడు స్పూన్లు
నీరు

తయారు చేసే విధానం:
ముందుగా గ్యాసు మీద ఒక బాణీ పెట్టి వేరుసెనగపప్పుని దోరగా వేయించుకోవాలి. చల్లారాక పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు ఒక బాణీ కానీ మందంగా ఉన్న గిన్నె గాని తీసుకొని అందులో తరిగిన బెల్లం వేసి బెల్లం మునిగేదాక నీరు పోసి గ్యాస్ మీద పెట్టి ముదురు పాకం పట్టుకోవాలి.

ఒక ప్లేట్ లో కొంచెం నీరు పోసి బెల్లం పాకం అవుతుండగా కొంచెం తీసి నీళ్ళలో వేసి అది ఉండ అవుతుంటే ముదురు పాకం వచ్చినట్టే. పాకం వచ్చాక అందులో వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు , పుట్నాలు వేసి బాగా కలపాలి.


ఇప్పుడు ఒక కంచం కాని ప్లేట్ గాని తీసుకొని గిన్నెలో ఉన్న మిశ్రమాన్ని ప్లేట్ లోకి పోసి ప్లేట్ అంతా సమానంగా పరచాలి. చల్లారాక ముక్కలుగా కట్ చేసి డబ్బాలో పెట్టుకోవాలి.

7/17/09

సగ్గుబియ్యం వడలు


కావలసిన పదార్ధాలు:

సగ్గుబియ్యం : పావు కిలో
బంగాళా దుంపలు: మూడు
పచ్చిమిర్చి : అయిదు లేక ఆరు
కొత్తిమీర: ఒక కట్ట
కరివేపాకు: రెండు రెబ్బలు
జీలకర్ర: ఒక చెంచా
వేరుశనగ పప్పు లేదా పల్లీలు : రెండు గుప్పెళ్ళు
ఉప్పు : రుచికి తగినంత
నూనె : వేయించటానికి సరిపడా

తయారు చేసే విధానం:
ముందుగా సగ్గుబియ్యం రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి. బంగాలదుంపలు చెక్కు తీసి ఉడకబెట్టుకోవాలి. ఉడికినవాటిని మెత్తటి ముద్దలాచేసి పక్కన పెట్టుకోవాలి. వేరుసెనగపప్పు వేయించుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి . పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి.
సగ్గుబియ్యం నానాకా నీళ్లు ఏమైనా మిగిలితే తీసెయ్యాలి. ఇప్పుడు నానిన సగ్గుబియ్యాన్ని ఒక గిన్నెలో తీసుకోవాలి.అందులో ఇందాక మనం ముద్ద చేసిపెట్టుకున్న బంగాళా దుంపల మిశ్రమాన్ని కలపాలి. అలాగే వేరుసెనగపప్పుపొడిని, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర మరియు ఉప్పు వేసిఅన్నిటిని బాగా కలుపుకోవాలి.

ఇప్పుడు గ్యాస్ మీద ఒక బాణీ పెట్టుకొని అందులో తగినంత నూనె పోసికాగనివ్వాలి. ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ కాని అరటి ఆకు కాని తీసుకొని సగ్గుబియ్యం మిశ్రమాన్ని తీసుకొని వడలాగా వత్తుకోవాలి.

వడని కాగుతున్న నూనెలోవేసి దోరగా వేయించుకోవాలి.

ఎంతో
రుచిగా కరకరలాడే సగ్గుబియ్యం వడలు తయారు అయినట్టే.

నేను ఈవంటకాన్ని ఈనాడు పేపర్లో చూసి ట్రైచేశాను...చాల బాగా వచ్చాయి....మీరూ తప్పక ట్రై చెయ్యండి మరి....వానాకాలం లో సాయంకాలం పూట వడలు చేసుకుంటే చాల బాగుంటుంది కదా....??